Swans

Swans
Little beautiful creations of God

Thursday, July 8, 2010

దైవం దగ్గర మీ అహంకారాన్ని వదులుకోవాలి ... మూగ జీవాల ప్రాణాలని కాదు

శాక్తేయం హిందూ ధర్మం లో అతి ముఖ్యమైన పూజావిధానం. ఈ జగత్తు అంతటికీ అమ్మవారు మూలం అని విశ్వసించి ఆ అమ్మ ని శక్తి గా కొలిచే సంప్రదాయమే శాక్తేయం. హిందువులుఅతి శక్తి వంతమైన దైవాలుగా, ఈ సృష్టి ని పరిపాలించే త్రిమూర్తులు గా కొలిచే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అమ్మ వారి ప్రేరణ తోనే ఈ లోకాలని సృష్టించి, పాలిస్తూ, లయం చేస్తున్నారనేది శాక్తేయం లోని ప్రధాన భావన.

అమ్మవారిని కొలిచే అనేక విధానాలలో - మంత్రం, తంత్రం, షోడశోపచార పూజ లాంటివి అతి ముఖ్యం అయినవి. ముఖ్యం గా తాంత్రిక విద్య అన్నిటి కన్నా ఎక్కువ గా వక్రీకరించబడిన పూజ విధానం. తాంత్రిక విద్య ని, అమ్మ వారి ఆరాధన ని జంతు బలితో ముడి పెట్టే ఆధారాలు ఏవి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో లేవు. ఒక వేళ అలాంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయని ఎవరన్నా వాదిస్తే అది ఖచ్చితం గా తప్పు గా అర్థం చేసుకోబడిన / వక్రీకరించబడిన విషయమే.

మన పురాణాల్లో కొన్ని చోట్ల మనిషి లోని అహంకారాన్ని మహిషం తో (ఎద్దు), మనిషి మనసు ని అజ తో (మేక) పోల్చారు. అహంకారాన్ని వదులుకోలేకపోయినా, మన మనసు ఎటు వెళ్ళితే మనం అటు పరుగులు తీసినా మనం నమ్మే దైవం దగ్గరికి మనం చేరలేము. మనలో ఉన్న లోపలి శత్రువులని జయించి ప్రేమ, వాత్సల్య భావనలతో మాత్రమే మనం మంచి స్థితి ని చేరుకోగలము. ఈ బోధన స్వార్ధ పరుల చేతుల్లో చివరికి మూగ జీవాలైన ఆవు, మేక ల బలికి దారి తీసి ఉండవచ్చు. ఇలాంటి అనేక బోధనలు సంకుచిత బుద్ది కలిగిన వారి చేతుల్లో కొత్త రూపం సంతరించుకున్నాయి.

అమ్మ వారు జగత్తు మొత్తాన్ని సృష్టించి, శాసించే మాతృమూర్తి - మనుషులు మాత్రమే కాదు, భూమి మీద సకల జంతు జాలాలు ఆవిడ కి బిడ్డలే. ఒక బిడ్డ తనని ఆరాధించే క్రమం లో ఇంకొక బిడ్డ ని బలి తీసుకోవడం అనేది అమ్మ ఏ మాత్రం హర్షించే విషయం కాదు. ఒక జీవి యొక్క రక్తాన్ని, మాంసాన్ని అర్పించడం ద్వారా అమ్మవారిని త్రుప్తి చెందేలా చెయ్యచ్చు అని ఎవరన్నా భావిస్తే అది కేవలం వాళ్ళ మూర్ఖత్వం.

అమాయకమైన మూగ జీవాల ప్రాణాలని శక్తి ఆరాధన పేరుతో బలిచ్చే వ్యక్తులని ఆ అమ్మవారు చాలా కఠినం గా శిక్షిస్తారు - ఏదో ఒక రూపం లో.

సమస్య అంతా మన ప్రజల ఆలోచనలో ఉంది. ప్రభుత్వం ఎన్నో ఎన్నో చట్టాలు చేసింది, చేస్తూ ఉంది. కాని హిందూ సంస్కృతి లో భాగం గా జంతు బలులని ప్రజలు ఆచరించి నంత కాలం ఈ పాపాలు ఇలా జరుగుతూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి. అమ్మ వారి శక్తి గ్రామ దేవత గా మొదలుకొని, క్షేత్ర స్థాయి లో, శక్తి పీఠాలుగా జగత్తు అంతా విస్తరించి ఉంది. అజ్ఞానం తోను, అవివేకం తోను అన్ని చోట్లా ప్రజలు ఇంకా జంతు బలులని శక్తి ఆరాధన లో భాగం చేస్తూనే ఉన్నారు. వ్యక్తి స్థాయి నుంచి చైతన్య పరచడం వల్లనే ఆ దురాచారాన్ని నెమ్మదిగా మన సమాజం నుంచి తరిమి వెయ్యచ్చు. సాటి ప్రాణుల పట్ల కరుణ గా, ప్రేమ గా ఉండటమే అమ్మవారికి మనిషి చెయ్యగలిగిన ఉత్తమం అయిన ఆరాధన.

No comments:

Post a Comment