ఒక గురువు గారి బోధనలలో విన్న సంఘటన ఇది -
ఒక మహా భక్తుడు, అమ్మవారి ఉపాసకుడు నల్లమల అరణ్య ప్రాంతం లో ఉండే వాడు. అతను అమ్మవారి పూజ చేస్తూ వంద మేకల్ని పూజలో బలి చెయ్యడానికి సిద్ధం చేసుకున్నాడు. కొన్ని మేకలను నిర్దాక్షిణ్యం గా బలి ఇచ్చిన తరువాత ఒక విచిత్ర సంఘటన జరిగింది. అతని విజ్ఞానం తో అతను జంతువుల తో సంభాషించగల నేర్పు ని కలిగి ఉన్నాడు. ఒక మేక ని బలి ఇవ్వడానికి తీసుకు వచ్చి దాని మెడ మీద కత్తి ఉంచి దాని కళ్ళలోకి చూశాడు. ఆ మేక లో అపారమైన సంతృప్తి , ఆనందం కనిపించాయి. అతనికి ఆశ్చర్యం గా అనిపించింది. 'మరి కొద్ది సేపటిలో ప్రాణం వదలబోతూ కూడా ఇంత సంతృప్తి గా ఎలా ఉండగలుగుతున్నావు ?' అని అడిగాడు.
ఆ మేక - 'అయ్యా ! కొన్ని జన్మల కింద నేను కూడా మనుష్యుడి గా ఉన్నాను. అమ్మవారి పూజ చేస్తూ, అమ్మ అనుగ్రహం కోసం తపించే వాడిని. దానిలో భాగం గానే ఒక మేక ని శక్తి పూజ లో బలి ఇచ్చాను. నా మనుష్య జన్మ వదిలిన తర్వాత నాకు నేను చేసిన పాపం ఏమిటో తెలిసింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం గా ఇప్పటికి తొంభై తొమ్మిది సార్లు మేక జన్మ ఎత్తి ఇతర మనుష్యుల చేతిలో బలి అయ్యాను. ఇది వంద వ జన్మ. నా పాపానికి ఇక్కడితో పరిహారం అవుతుంది. నేను ఇక జన్మ రాహిత్యాన్ని పొందుతాను. అందుకే మీరు నన్ను బలి ఇవ్వబోతున్నా నాకు ఆనందం గానే ఉంది' - అని చెప్పింది.
ఇది విన్న ఈ భక్తుడు నిలువునా కదిలిపోయాడు. తాను ఇప్పటి వరకు ఎంత పాపం చేస్తూ వస్తున్నాడో అర్థం అయ్యింది. 'ఇప్పటి వరకు చేసిన పాపం చాలు. ఇక ముందు చెయ్యలేను. నేను నిన్ను బలి ఇవ్వను, కాపాడుతాను' అని పలికాడు. 'అయ్యా ! మీరు నన్ను బలి ఇస్తే నాకు మేలు చేసిన వారు అవుతారు. నా పాపానికి పూర్తి పరిహారం లభిస్తుంది. మీరు నన్ను బలి ఇచ్చి నాకు జన్మ రాహిత్యం ఇవ్వండి. నేను ఇప్పటికే చేసిన తప్పుకి కుమిలి పోతున్నాను ' అని ఆ మేక ప్రాధేయ పడింది. ఇలా వాదం ప్రతివాదం కొనసాగాక ఆ భక్తుడు చుట్టూ అడవిలో ఒక మనిషి ఎవరన్నా ఉన్నారా అని వెతికాడు. ఒక మేకల కాపరి తన కత్తి ని పదును చేసుకుంటూ కనిపించాడు.
ఆ భక్తుడు మేకల కాపరి దగ్గరికి వెళ్లి - 'ఈ మేక చాలా మహిమ కలిగినది, ఉత్తమం అయినది, ఎటువంటి కష్టం రాకుండా - చంపకుండా దీనిని కాపాడు, నీకు మేలు జరుగుతుంది ' అని చెప్పి అతనిని ఒప్పించి ఈ మేక ని అతనికి అప్పగించాడు. అప్పుడు ఆ భక్తుని మనసు తెప్పరిల్లింది. తన వలన జరిగిన పాపాలకి చింతిస్తూ అమ్మవారికి సాత్విక విధానం లో పూజ చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుని కర్తవ్యోన్ముఖుడు అయ్యాడు.
చంపకుండా వదిలి వేయబడ్డ మేక నిరాశ గా, తన పాప పరిహారం గురించి ఆలోచిస్తూ ఆ మేకల కాపరి వెంట బయలుదేరింది. కొండల్లో కోనల్లో నడుస్తూ ఉండగా ఒక చోట మేకల కాపరి జారి పడబోయాడు. పట్టు కోసం అతను చేసిన ప్రయత్నం లో పదునైన కత్తి ఈ మేక మెడ మీద పడింది. ఒక ప్రాణం ఖరీదు ఎంతో అనుభవించి ప్రాయశ్చిత్తం పొందిన ఆ మేక ఆ జన్మ ని కూడా ముగించి అమ్మవారిలో లీనం అయ్యింది.
No comments:
Post a Comment