ఒక గురువు గారు శక్తి పూజ గురించి చెప్పిన విషయాలలో కింద సంఘటన ని కూడా వివరించారు. ఆ సంఘటన నిజమని నేను నమ్మాను. 'ఈ రోజుల్లో కూడా ఇలాంటివి జరుగుతాయా?' అని చాలా మంది సందేహ పడవచ్చు. కాని నేటికీ అమ్మ వారిని ఉపాసన చేసిన ఎంతో మందికి అమ్మవారి సాక్షాత్కారం ఏదో ఒక రూపం లో లభిస్తూనే ఉండటం నేను చూస్తున్నాను, వింటున్నాను.
నేటి ఉత్తరాంచల్ రాష్ట్రం లో ఒక మారు మూల ఉన్న గ్రామం లో 'ధారీ దేవి' గుడి ఒకటి ఉంది. అక్కడ అమ్మ వారు కళ్యాణ కారిణి గా పిలవబడుతూ పూజలు అందుకుంటున్నారు. కాళికా దేవి రాక్షస సంహారం చేశాక ఆగ్రహం చల్లారక అటు ఇటు తిరుగుతూ తనకి అడ్డు వచ్చిన ప్రతి దానిని నేలమట్టం చేస్తోంది. దేవతలంతా భయపడి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించమని శివుడిని ప్రార్థించారు. శివుడు అమ్మ వారు వెళ్ళే మార్గం లో అడ్డుగా పడుకున్నాడు. అమ్మ వారు ఆగ్రహం తో నడుస్తూ స్వామి వారి మీద అడుగు వేశారు. అప్పుడు అమ్మవారికి ఒక్క సారిగా కోపం తగ్గింది. తను చేసిన పనికి చింతించడం మొదలుపెట్టారు. 'ఎందుకు ఇంత కోపం గా ఉన్నావ్ ?' అని శివుడు ప్రశ్నించగా 'రాక్షసులతో జరిగిన యుద్ధం లో అనంతమైన శక్తి ఉద్భవించింది. ఇంత శక్తి ని ఎలా ఉపయోగించాలో తెలియజేయమని' అమ్మవారు ప్రార్థించారు. స్వామి వారు ఈ శక్తి ని భూ లోకం లోని మన బిడ్డ ల ఆలనా-పాలనా చూడటానికి ఉపయోగించు అని చెప్పారు. అప్పుడు అమ్మవారు ఈ గుడి ఉన్న చోటనే భూ లోకం లోకి ప్రవేశించారు అని భక్తుల నమ్మకం.
దాదాపు రెండు వేల సంవత్సరం వరకు ఇక్కడ విపరీతం గా జంతు బలులు జరుగుతూ ఉండేవట. అక్కడ పూజారి తో సహా మాంసం తినే అలవాటు అందరికీ ఉండటం తో ఆ దురాచారం నిత్యం సాగుతూ వచ్చిందట. ఒక నాడు పూజ లో ఉన్న పూజారికి అమ్మవారు సాక్షాత్కరించి 'ఈ సృష్టి లోని ప్రతి జీవి నా బిడ్డడే. అమాయక ప్రాణులను నా పేరు తో బలి ఇచ్చే ఈ ఆచారాన్ని ఇక్కడితో ఆపించు. ఈ జీవ హింస ఆపకపోతే నా ఆగ్రహాన్ని చూస్తావు' అని హెచ్చరించారట.
'ఇది తరతరాల ఆచారం కదా, నేనొక్కడినే ఎలా ఆపగలను అమ్మా ' అని అతను అడిగాడట. 'నీ ముందు ఇక్కడ ఉన్న పూజారులకి కూడా నేను ఇదే హెచ్చరించాను. ఇప్పుడు నిన్ను కూడా హెచ్చరిస్తున్నాను' అని అమ్మవారు స్పష్టం చేసారట.
ఆ పూజారి గ్రామస్తుల చేత జంతు బలులు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ మొదట్లో చాలా మంది ఈ విషయాన్ని నమ్మలేదు. కాని ఆ పూజారి స్వయం గా తను మాంస భక్షణ మానివేసి అందరికీ అదే ఉపదేశం చేశాక ఆ ఆలయం లో జంతు బలులు పూర్తిగా ఆగిపోయాయి.
చెడు ని చీల్చి చెండాడే వీర రూపం - అమ్మవారి కొన్ని అవతారాలలో ఉంటుంది. ప్రపంచం లో ఎంతటి రాక్షసత్వం అనాది నుంచి ఉన్నదో మనకి ఎప్పుడూ అవగతం అవుతూనే ఉంది. అప్పట్లో రాక్షసులు భీకర రూపం లో ఉండే వారని మన పురాణాలలో చెప్పి ఉన్నారు. కాని ఈ కలి కాలం లో మేక వన్నె పులుల లాంటి మనుషుల లోనే భయంకరమైన రాక్షసత్వం నిండి ఉంటోంది. డబ్బు కోసం పసి పిల్లలని కొలిమి లో బూడిద చేసే రాక్షసులు మన చుట్టూ ఉన్నారు. ఇలాంటి ప్రపంచాన్ని ఇంకా భ్రష్టు పట్టకుండా కాపాడేందుకు, అమాయక ప్రజల్ని రక్షించేందుకు కాళికా అమ్మవారిలాంటి శక్తి స్వరూపాలని ఆరాధించడం మానవాళి కి చాలా అవసరం. అయితే అంతటి శక్తి స్వరూపాన్ని నిర్మలమైన భక్తీ, మంచి ప్రవర్తన తో మాత్రమే ప్రసన్నం చేసుకోగలం.
ఊదా రంగు లేదా గాఢమైన రంగుల పుష్పాలతో అమ్మవారిని అర్చించ వచ్చు. సాత్వికమైన పూజ, ధ్యానం, ఉపచారం, సాత్విక నైవేద్యం తోనే అమ్మవారి కృప ని పొందవచ్చు. అమ్మవారికి తీపి పదార్థాన్ని నివేదించి ఆ తీపి ని నలుగురితో పంచుకోవడం మాత్రమే కాదు, అమ్మ ప్రేమ తత్వాన్ని మన చుట్టూ ఉన్న ప్రతి జీవికి ఎంతో కొంత పంచడమే - శక్తి ఆరాధన లోని ఉత్తమ లక్ష్యం.
No comments:
Post a Comment